Kurnool | ఏపీ లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వాలంటీర్లు ప్రజల కోసం కాకుండా వైసీపీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ల అక్రమాలపై రాష్ట్రంలో ఏదొక మూలనుండి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామ సచివాలయంలో పెన్షన్ సొమ్ము వేలల్లో మాయం అవడం చర్చకు దారితీసింది. తాజాగా, గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన పింఛన్ల సొమ్ములో రూ.50 వేలు హాంఫట్ అయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఈ విషయం బయటకి రాకుండా స్థానిక వైసీపీ లీడర్ వేసిన ప్లాన్ హాట్ టాపిక్ అయింది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామ సచివాలయానికి చెందిన సంక్షేమ సహాయకురాలు మండల కేంద్రం నుంచి సోమవారం పింఛన్ సొమ్ము తెచ్చి సచివాలయంలో ఉంచారు. కాసేపటి తర్వాత చూడగా అందులో రూ.50 వేలు తగ్గాయి. దీంతో అక్కడున్న ఏడుగురు వాలంటీర్లను ప్రశ్నించగా తమకేమీ తెలియదని వారు సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఉద్యోగి తీసుకెళ్లారు.
Kurnool | తగ్గిన సొమ్మును సర్దుబాటు చేసేందుకు ఒక్కో లబ్దిదారుకు రూ.100 తగ్గిద్దామని వాలంటీర్లలో కొందరు సలహా ఇవ్వగా కార్యదర్శి అందుకు ఒప్పుకోలేదు. చేసేదిలేక ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయం మండల వైసీపీ నాయకుడి వద్దకు వెళ్లడంతో ఆయన వారిని పిలిపించారు. పార్టీ పరువు పోతుందని చెప్పి వాలంటీర్లను హెచ్చరించారు. అనంతరం వాళ్లలో వాళ్లు సర్దుబాటు చేసుకుని సొమ్ము జమ చేసేలా పంచాయితీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వాలంటీర్లను ఇక ఎలా నమ్మాలంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు నోరు మెదపలేదు.