BRS Manifesto | అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ కి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 16 నుంచి ఆయన భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు వేదిక వరంగల్ జిల్లా కాబోతున్నది. ఆ జిల్లా నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అనేక బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. తొలి బహిరంగ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం విడుదల చేస్తారు. ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయినట్లు సమాచారం.
అన్నివర్గాలను సంతృప్తి పరిచేలా భారీ మేనిఫెస్టో(BRS Manifesto):
సీఎం కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా, అన్నివర్గాల ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగా పలు కీలకమైన హామీలను గుప్పించబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా అనేక సంక్షేమ పథకాలను ప్రకటించబోతున్నట్లుగా వినిపిస్తోంది. ఈ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరగడం ఖాయమని పార్టీ లీడర్లు ఇప్పటికే పేర్కొన్నారు. మేనిఫెస్టో ప్రకటన బీఆర్ఎస్ అభ్యర్థులను విజయ శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓటర్లపై ఆకట్టుకునేందుకు ఎలాంటి వరాలను కురిపించబోతున్నారన్న అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజకీయాల్లో అత్యంత పదునైన ప్రణాళికలు రూపొందించడంలో.. ప్రజల మూడ్ ని పసిగట్టడంలో కేసీఆర్ దిట్ట. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఆ దిశగా శరవేగంగా పార్టీని పరుగులు తీయిస్తున్నా రు. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితా పై కొన్ని నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే దీని ప్రభావం ఎన్నికలపై పడకుండా సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అసంతృప్తికి లోనైన నాయకులంతా ప్రస్తుతం చల్లబడ్డారు. జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ పరిణామం పార్టీ అభ్యర్థుల విజయానికి మరింత దోహదం చేసే అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతేకాదు, ప్రచారహోరు కోసం బలమైన మేనిఫెస్టోను కూడా కేసీఆర్(KCR) సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్… ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం మరిన్ని సంక్షేమ పథకాలతో రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అదిరిపోయే విధంగా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైతులపై మరోసారి వరాల జల్లు కురిపించబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రైతులకు నెలవారి ఫించన్లు ఇచ్చే అంశంపై 16వ తేదీన జరుగనున్న బహిరంగ సభలో కేసీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే ఆసరా పెంపు, నిరుద్యోగభృతిని ఎలా ఇవ్వబోతున్నామన్న అంశంపై కేసీఆర్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతిపై కేసీఆర్ ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే పట్టణవాసులకు ఆస్తిపన్ను చెల్లింపుల్లో భారీ ఊరట ఇచ్చే విధంగా కేసీఆర్ నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా సమాచారం.