ఏపీలో మద్యం విధానం, సరఫరాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వాలని తాము చేసిన సవాల్‌కు ప్రభుత్వం స్పందించలేదని అందుకే తానే వారి పేర్లు బయటపెడుతానని తెలిపారు. ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ దగ్గర 100 డిస్టలరీ కంపెనీలు నమోదైతే 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయన్నారు. 2019లో మొదలైన అదాన్ డిస్టలరీస్ కంపెనీకి రూ.1,164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ వెళ్లిందన్నారు. ఈ కంపెనీ వెనక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ఉన్నారని ఆమె ఆరోపించారు. టీడీపీకి చెందిన చింతకాయల రాజేష్, పుట్టా మహేష్‌కు చెందిన కంపెనీలను బలవంతంగా లాక్కున్నారు అంటూ విమర్శించారు.
ఇక ఎస్పీవై అగ్రోస్ సంస్థ వెనక మరో ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) ఉన్నారని.. ఈ కంపెనీకి రూ.1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్ వెళ్లిందన్నారు. ప్రకాశం జిల్లాలో పెరల్ డిస్టలరీస్‌ను సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వివరాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు తామే ఆ వివరాలు బయటపెట్టామన్నారు. మద్యం తయారీదారులని, అమ్మకందారులని ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామని సీఎం జగన్(YS Jagan) హామీ ఇచ్చారు కదా ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదలచేశాం.. వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మండిపడ్డారు.
చిన్న చిన్న కిరాణా షాపులు, వీధి బండ్ల వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ బదిలీలను వినియోగిస్తున్నారు కానీ ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయటం లేదు? అని ప్రశ్నించారు. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని.. అలాగే ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కూడా కోరామని పురందేశ్వరి(Purandeswari) తెలిపారు.
Read Also: వాషింగ్ మెషిన్‌లో రూ.1.30కోట్లు.. జలకిచ్చిన విశాఖ పోలీసులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat