వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు(Raghu Rama Krishna Raju) ఏపీ ప్రభుత్వం అవినీతిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజా ధనానికి నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు సీఎం జగన్(YS Jagan)పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చార్జిషీట్లు దాఖలు చేసి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ట్రయల్ ప్రారంభం కాలేదని.. నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొ్న్నారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న తీవ్రమైన అభియోగాలు ఉన్న కేసుల్ని ఏడాది లోగా తేల్చేలాని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు రానుంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే.