బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న రోహిత్ రెడ్డి నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి నివాసంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో లెక్కల్లోకి రాని రూ.20లక్షలు.. సోదరుడి ఇంట్లో మరో రూ.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూరు నియోకజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) పోటీ చేస్తున్నారు.
మరోవైపు పాతబస్తీలోని పలు వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి పలు రికార్డును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు సమకూరుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి(Vivek Venkata Swamy), ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.