తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటుచేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 2,290 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున పోటీలో నిలిచారు. గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు ఉన్నారు.
రాష్ట్రం మొత్తమ్మీద 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,62,98,418 పురుషులు .. 1,63,01,705 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 9.9 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు.