తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చకాచకా జరుగుతున్నాయి.స్టేడియానికి జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం సీఎంగా ప్రకటన అనంతరం ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. పార్టీ పెద్దలను కలిసి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.
మరోవైపు తన కేబినెట్ టీమ్‌పై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంత్రివర్గంలో 18 మంది వరకు చోటు దక్కనుంది. దీంతో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై చర్చించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, దామోదర్ రాజనరస్సింహా, శ్రీధర్ బాబు, రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, సుదర్శన్ రెడ్డి, పొన్నం ప్రభావకర్ వంటి సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం.