ఛత్తీస్గడ్(Chhattisgarh) సీఎం పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. విష్ణుదేవ్ సాయ్(Vishnu Deo Sai) ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ఉత్కంఠకు బ్రేకులు వేసింది. ఆదివారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ నేతగా విష్ణుదేవ్ ని ఎన్నుకున్నారు. అనంతరం బీజేపీ కేంద్ర పరిశీలకులు అర్జున్ ముండా, శర్వానంద్ సోనోవల్, దుష్యంత్ గౌతమ్ లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా విష్ణుదేవ్ పేరుని ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి వంటి నేతలు ఉన్నారు. అయితే వీరందరినీ పక్కన పెట్టి గిరిజన నేతవైపే మొగ్గు చూపింది బీజేపీ అధిష్టానం.
విష్ణుదేవ్(Vishnu Deo Sai) ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మొదలైన ఆయన పొలిటికల్ కెరీర్.. నేడు సీఎం పీఠం అధిష్టించే స్థాయికి చేరింది. మోదీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రెండుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర మాజీ సీఎం రమణ్ సింగ్(Raman Singh) తో విష్ణుదేవ్ కి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే, రెండు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన తన స్వగ్రామం బాగియాలోని ఇంట్లోనే నివాసం ఉండటం విశేషం.