పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి(Shaik Sabji) దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన భీమవరం(Bhimavaram) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ కారులో వెళ్తున్నారు. అయితే అకివీడు వైపు వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన(Shaik Sabji) ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.