కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓటు వేశారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అయినా కానీ వారిలో మార్పు రాలేదని.. కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao) తప్ప మిగిలిన సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతం, కడుగుతం అని శ్రీశ్రీ మాటల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజాభవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రగతిభవన్ ముందు ఉన్న గేట్లను బద్ధలుకొట్టి ప్రజలకు అవకాశం ఇచ్చామన్నారు. గతంలో హోం మంత్రి మహమూద్ అలీ , ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తే ప్రవేశం కల్పించలేదన్నారు. ఆఖరికి ప్రజా గాయకుడు గద్దర్(Gaddar)ను మండుటెండలో నిల్చోబెట్టారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు వచ్చాయని.. ఉద్యమంలో పాల్గొన్న మాజీ డీఎస్పీ నళినికి సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కలుగజేసుకుని అసెంబ్లీలో టీపీసీసీ హోదాలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామన్నారు. దీంతో మేనెజ్‌మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్.. సీఎం కాలేదనే అక్కసు.. కుళ్లుతో రగిలిపోతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘోరవ్ చేయగా.. సస్పెండ్ చేయండని ఓ ఎమ్మెల్యే స్పీకర్‌కు సూచించారు. అయితే అధ్యక్షా.. వారిని బయటకు పంపించవద్దు.. వారు వినాల్సిందే.. వారికి ఇదే శిక్ష.. వాళ్లను ఇక్కడ కూర్చోబెట్టి.. కఠోరమైన నిజాలు వినిపిస్తానని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు.