హైదరాబాద్ లో చికెన్ లవర్స్ కి భారీ షాక్ తగిలింది. కార్తీకమాసం ముగియడంతో చికెన్ ధరలు(Chicken Rates) భారీగా పెరిగాయి. చికెన్ షాపుల ముందు నాన్ వెజ్ లవర్స్ కిటికిటలాడుతున్నారు. నిన్నటి వరకు రూ.120 నుండి రూ.150 పలికిన చికెన్ ధర ఇవాళ రూ.210 నుండి రూ.230 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసమంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక స్నానాలు చేస్తూ పరమ శివుడిని ధూపదీపాలతో నిత్యం ఆరాధిస్తారు. ఈ క్రమంలో కార్తీక మాస పూజలు చేసే వారి ఇళ్లలో నెల మొత్తం నాన్ వెజ్(Non Veg) తినరు. దీంతో ఆ నెలంతా చికెన్, మటన్ ధరలు తగ్గిపోతాయి. అందుకే కార్తీక మాసంలో చికెన్ ధర(Chicken Rates) దాదాపు రూ.120 లకి పడిపోయింది. బుధవారం (డిసెంబర్ 13)తో కార్తీకమాసం పూర్తయింది. దీంతో కోడి ధరలు కొండెక్కాయి. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ ధర రూ.210 నుండి రూ.230 వరకు పలుకుతోంది.