లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి(INDIA Alliance) వేగంగా పావులు కదుపుతోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వంతో పాటు పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఉభయసభల్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసనకు దిగాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , మమతా బెనర్జీ , స్టాలిన్ , శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ భేటిలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను ఇండియా కూటమి(INDIA Alliance) ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)తో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని స్పష్టం చేశారు.