కొమ్ము కోనం చేప(Kommu Konam Fish).. ట్యూనా చేప తర్వాత అంతటి ఖరీదైన చేప ఇదే. బంగాళాఖాతంలో మాత్రమే దొరికే ఈ అరుదైన చేప వలలో పడితే.. ఆరోజు జాలర్లకి పండగే. అయితే ఈ చేప పడితే ఎంత సంతోషిస్తారో అంతే భయపడతారు కూడా. ఎందుకంటే ఈ చేప ఎదురుదాడి చేస్తుంది. తనకి అపాయం అనుకుంటే వేటగాళ్లనే వేటాడి చంపేస్తుంది. కొమ్ముకోనం చేపలకి పొడవైన కొమ్ము ఉంటుంది. దీంతో వలలో చిక్కినప్పుడు తప్పించుకోవడానికి కొమ్ముతో వలని చీల్చి బయటకి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో జాలర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, దానిని కట్టడి చేసినా వారిని కూడా కొమ్ముతో దాడి చేస్తుంది. దీని కొమ్ములో విషం ఉన్న కారణంగా అది పొడిస్తే మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని జాలర్లు చెబుతున్నారు. ఇటీవల కొమ్ముకోనం దాడిలో జోగన్న అనే జాలరి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ చేప ఎక్కడపడితే అక్కడ దొరకదని చెబుతుంటారు. ఈ రకం చేపలు సముద్రంలో ఎక్కడ దొరుకుతాయో కొంతమందికి మాత్రమే తెలుసట. కొమ్ముకోనం చేపలు డేంజరస్ అని తెలిసినప్పటికీ వాటిని వేటాడటానికి జాలర్లు ఎందుకు ప్రయత్నిస్తారంటే.. అవి కురిపించే కాసుల వర్షంతో లైఫ్ సెటిల్ అయిపోతుందనే చిన్న ఆశ. అలా ఇద్దరు వ్యక్తులు కోటీశ్వరులు కూడా అయ్యారు. ఈ చేపల్ని చిన్నగా ఉన్నప్పుడు వంజరం(Vanjaram Fish) అని పెద్ద సైజులో ఉన్నవాటిని కొమ్ముకోనం అంటరాని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక్కో కొమ్ముకోనం చేప(Kommu Konam Fish) 20 నుండి 250 కేజీల బరువు, 6 నుండి 12 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. కేజీ దాదాపు రూ.1000 వరకు పలుకుతుంది. దీంతో ఒక్క భారీ కొమ్ముకోనం దొరికినా కొన్ని రోజుల పాటు వేటకు వెళ్లాల్సిన అవసరం లేదని మత్స్యకారులు భావిస్తుంటారు. అయితే, ఇప్పుడు అనకాపల్లి జిల్లా పూడిమడక(Pudimadaka) లో వేటకి వెళ్ళిన మత్స్యకారులకు ఈ చేప దొరికింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా కొమ్ముకోనం చేపని ఒడ్డుకు తీసుకువచ్చినట్టు స్థానిక మత్స్యకారుడు కొండయ్య తెలిపారు. ధర ఎంత పలుకుతుందో చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.