వైసీపీలో రోజురోజుకు తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఎమ్మెల్యేల మార్పు అంశం ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించగా.. తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి(MLA Parthasarathy) ఏకంగా సీఎం జగన్‌పైనే ధిక్కార స్వరం వినిపించారు.
అధినేత జగన్ తనను గుర్తించలేదు..
కృష్ణా జిల్లా పెనమలూరు(Penamaluru) నియోజకవర్గంలోని కంకిపాడులో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో పార్థసారథి(MLA Parthasarathy) మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ సీఎం జగన్ తనను గుర్తించకపోయినప్పటికీ.. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను గుర్తించారని తెలిపారు. పార్టీలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. దీంతో వేదికపై ఉన్న మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కోపంతో కిందకు దిగి వెళ్లిపోవడం కలకలం రేపింది.
ఓ సామాజిక వర్గం టార్గెట్ చేసింది..
ఇటీవల గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna Rambabu) కూడా పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలోని ముఖ్య సామాజికవర్గం తనను టార్గెట్ చేసిందని.. ఆ చాలా ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని.. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తానని వెల్లడించారు.
మనిషిగా కూడా చూడలేదు..
అంతకుముందు ఎమ్మెల్సీ వంశీకృష్ణ(Vamsi Krishna)వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఈ సందర్భంగా తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు. కష్టపడి పనిచేసినా గుర్తించలేదని.. కనీసం మనిషిగా కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయడం వెనుక.. ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, ధనుంజయరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. మొత్తానికి ఎమ్మెల్యేల మార్పు అంశం వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఇంకెంతమంది నేతలు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తారో.. మరెంతమంది వేరే పార్టీల్లో చేరతారో వేచి చూడాలి.