తెలంగాణ ఆర్టీసీ(TSRTC)లో 80 కొత్త బస్సులు చేరాయి. బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. నేటి నుంచే ఆర్టీసీ ప్రయాణికులకు ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 30 ఎక్స్ప్రెస్లు, 30 రాజధాని ఏసీలు, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్ లు ఉన్నాయి. ప్రారంభ కార్యక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) వల్ల పెరిగిన రద్దీని తగ్గించే ప్రయత్నంలో భాగంగా కొత్త బస్సులను కొన్నట్టు ఆయన చెప్పారు. మరో 1,050 బస్సులు రూ.400 కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. జీరో టికెట్ మీద ఇప్పటివరకు 6 కోట్ల మహిళలు ప్రయాణించినట్లు తెలియజేశారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది కాబట్టి ఆర్టీసీ(TSRTC) సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసీ సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్టీసీని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్దామని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఆర్టీసీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అవన్నీ కలిసి పరిష్కరించుకుందామని సిబ్బందిని ఉద్దేశించి చెప్పారు. ఈ సందర్భంగా సీసీఎస్(CCS) బకాయిలు కూడా దశలవారీగా విడుదల చేస్తామని కీలక ప్రకటన చేశారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.