Aditya L1 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)అంతరిక్షంలో మరో ఘనత సాధించింది. సూర్యుడి రహస్యానాలను ఛేదించేందుకు నింగిలోకి పంపిన ‘ఆదిత్య ఎల్-1’ ఉపగ్రహం విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. 125 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఈ ఉపగ్రహం.. సూర్యుడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి చేరుకుంది.
Aditya L1 ప్రయోగం విజయంవంత కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. “భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది” అని ట్వీట్ చేశారు. కాగా సౌర కుటుంబం రహస్యాలను లోతుగా అధ్యయనం చేసేందుకు గతేడాది సెప్టెంబర్ 2న ‘ఆదిత్య L’ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.