ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా(Collector Girisha)పై సస్పెన్షన్ వేటు వేసింది. 2021లో జరిగిన తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా గిరీషా ఉన్నారు. ఆ సమయంలో ఈఆర్‌వోగా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడీని అధికార వైసీపీ నేతలకు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. గిరీషా(Collector Girisha) లాగిన్ ఐడీ ద్వారా 30 వేలకుపైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసినట్లు తేలింది. దీంతో గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఈసీ(CEC) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయనతో పాటు ప్రమేయం ఉన్న ఇతర అధికారుల వివరాలు కూడా ఆరా తీసే పనిలో ఉంది. అలాగే ఓటర్ల జాబితాలో అక్రమాలకు సహకరించిన మిగిలిన అధికారులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సాధారణ ఎన్నికలను సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.