ఎన్నికల వేళ జనసేన పార్టీ(Janasena Party)కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జనసేన పార్టీ కార్యాలయం మెయిల్‌కు అందినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించాని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
గత సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన(Janasena) అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే బరిలో దిగనున్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు అందజేశారు. ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తు కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేనాని ధన్యవాదాలు తెలియజేశారు.