Nagababu Tweets | చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాజోలు(Razole), రాజానగరం(Rajanagaram) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ నుంచి ఒత్తిడి ఉందని. అందుకే ఈ రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన నేత నాగబాబు(Nagababu) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని ఆయన ఉదహరిస్తూ ఓ పోస్ట్ చేశారు. అయితే టీడీపీ(TDP)కి కౌంటర్‌గా జనసేన(Janasena) కూడా రెండు స్థానాలను ప్రకటించడాన్ని పరోక్షంగా ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరుగుతుండగానే తాజాగా మరో ట్వీట్ చేశారు.
“నేను పెట్టే ప్రతీ పోస్ట్‌కి ఏదొక అర్ధం ఉంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు Physics laws పోస్ట్ చేశాను. రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు” అంటూ తెలిపారు. టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే తమ పట్టు నిరూపించుకొనే ప్రయత్నంలో భాగంగానే ఈ ట్వీట్స్ చేశారనే అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం వైసీపీకి కౌంటర్‌గా నాగబాబు ట్వీట్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి నాగబాబు(Nagababu) ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.