తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీ మేరకు ఈ ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందించారు. నిరుద్యోగ కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ(TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే 15వేల పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని గడిచిన పదేళ్లలో యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఆయన కూతురు కవిత ఎంపీగా ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చారని సీఎం(CM Revanth Reddy) విమర్శించారు.