ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ paytm పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం ఆ సంస్థకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ హెచ్చరించింది. ఫిబ్రవరి 29 నుంచి వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, టాప్ అప్స్ కి అనుమతి ఉండబోదని తేల్చి చెప్పింది. అంతేకాదు, పేటీఎమ్ మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ అకౌంట్లను కూడా సెంట్రల్ బ్యాంక్ బ్యాన్ చేసింది.
అయితే కస్టమర్లు తమ అకౌంట్ నుంచి అమౌంట్ విత్ డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. యదావిధిగా తమ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కాగా, పేటీఎమ్ సంస్థలో పలు అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్‌టర్నల్ ఆడిటర్ ల ధ్రువీకరణ నివేదిక పరిశీలించిన తర్వాత పేటీఎమ్ బ్యాంక్ కార్యకలాపాలపై పర్యవేక్షణ అవసరమని భావించామని పేర్కొంది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. అయితే, ఈ ఆంక్షలు Paytm UPI పై ఎలాంటి ప్రభావం చూపదు అని వెల్లడించింది.