కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ‘ఛలో నల్గొండ’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్(KCR).. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య అని తెలిపారు.
“కేసీఆర్ చలో నల్లగొండ అంటే కేసీఆర్‌ను తిరగనివ్వం అని అంటరు. ఇంత మొగోళ్లా..? కేసీఆర్‌ను తిరగనివ్వరంట.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఏం చేస్తరు చంపేస్తరా..? దా.? చంపుతావా ఏపాటి చంపుతావో దా..? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా.. ఇది పద్దతా.. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల తరపున వస్తది. ప్రజల మధ్య అడుగుతది. మీకు దమ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్. కరెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. చలో నల్గొండ(Chalo Nalgonda) కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొందరికి ఇది రాజకీయం. మనకేమో ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కాదు. కృష్ణా జలాలు, నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుగుతూ చెప్పా” అన్నారు.
“24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ మొత్తం రాష్ట్రానికి నేను చెబుతూనే ఉన్నా. ఇటు కృష్ణా కావొచ్చు.. అటు గోదావరి కావొచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే ఇదే నల్గొండబలో బతుకులు ఒంగిపోయాయి. లక్షా 50వేల మంది మునుగోడు, దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డల నడుములు ఫ్లోరైడ్‌లో ఒంగిపోయాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులంతా కలిసి ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి ప్రధాని టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇదీ అని చెప్పినా.. మనల్ని ఎవరూ పట్టించుకోలేదు. నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకం అనుకుంటున్నారు. ఉవ్వెతున ఉద్యమం లాగా మనం ఎగిసిపడకపోతే, మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరూ మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెట్టుకోండి” అని తెలిపారు.
“ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫలితం చూశాం. ఒకనాడు ఏడ్సిన తెలంగాణ.. నేడు మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది. రైతుబంధు ఇవ్వడానికి కూడా చేతనైత లేదు. ఇంత దద్దమ్మలా..? రైతుబందు కూడా ఇవ్వరా..? అన్నదాతలను పట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండకావరమా..? కండ్లు నెత్తికి వచ్చినాయా..? ప్రజలను అలా అనొచ్చా..? ఒక్క మాట చెబుతున్నా జాగ్రత్త.. నోటి దరుసుతో మాట్లాడేటోళ్లరా… చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంటయి.. బందోబస్తుగా ఉంటాయి.. గట్టిగా ఉంటయి.. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతాయి” అంటూ కేసీఆర్(KCR) ఫైర్ అయ్యారు.