ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల విధుల్లో వాలంటీర్ల(AP Volunteers) పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల విధులకు అప్పగించకూడదని.. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని కలెక్టర్లను ఆదేశించింది. అలాగే బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. అయితే వారికి ఇతర పనులు అప్పగించుకోవచ్చని తెలిపింది.
ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి(AP Volunteers) కూడా ముఖ్యమైన ఎన్నికల పనులు కేటాయించకూడదని పేర్కొంది. ఓటు వేసిన వారికి సిరా గుర్తు పెట్టడం వంటి విధులను మాత్రమే కేటాయించాలని చెప్పింది. ఒక పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఎన్నికల బృందంతో ఒకరికి మించి సచివాలయ సిబ్బంది ఉండకూడదని వివరించింది. ఈ ఆదేశాలను అధికారులు తప్పకుండా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.