జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన కుడి చేతికి రెండు ఉంగరాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. అందులో ఒకటి తాబేలు ఉంగరం, రెండోది నాగ ప్రతిమ ఉంగరం. దీంతో ఆయన ఈ ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై జ్యోతిష్య నిపుణులు స్పందించారు.
“పవన్ కల్యాణ్ జాతకం పరంగా చూస్తే… ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. ఆయనది మకర రాశి. మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు. చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలను ఇస్తాయి.
కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు, నర ఘోష, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఎదుగుదలకు, అధికారానికి, ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష శాస్త్రంలో చెబుతారు” అని వివరించారు. ఈసారి ఎలాగైనా రాజకీయాల్లోకి రాణించాలనే ఆలోచనలో ఉన్న పవన్.. జ్యోతిష్యులు చెప్పిన సూచన మేరకు ఈ రెండు ఉంగరాలు ధరించారని జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి.