తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. బీజేపీ ఆమెను తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సెంట్రల్ స్థానాల్లో ఒక స్థానం నుంచి తమిళిసై పోటీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళిసై తన పదవులకు రాజీనామా చేసినట్టు స్పష్టం అవుతోంది.
కాగా, గత కొంతకాలంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఆమెని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లో పోటీ చేయించనున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయమై తమిళిసైని ప్రశ్నించగా.. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీ చేయడానికి రెడీ అన్నారు కానీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఈరోజు ఆమె తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.