జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. వారాహి విజయభేరి యాత్ర తిరిగి ప్రారంభంకానుందని తెలిపారు. ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని.. ఏప్రిల్ 8న యలమంచిలిలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసగింస్తారని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 9న ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారన్నారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ పర్యటన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
కాగా మార్చి 30వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం(Pithapuram) నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పటికే అస్వస్థతతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఎండలో పాదయాత్ర చేయటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తెనాలిలో జరగాల్సిన సభతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వైద్యులు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని.. కోలుకున్న తర్వాత పర్యటన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా ఆయన(Pawan Kalyan) జ్వరం నుంచి కోలుకోవటంతో పర్యటన షెడ్యూల్ ప్రకటించారు.
మరోవైపు పొత్తులో భాగంగా జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. పాలకొండ అసెంబ్లీ మినహా 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం పాలకొండ అసెంబ్లీ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే పాలకొండ టీడీపీ సీనియర్ నేత నిమ్మక జయకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. దీంతో ఆయనకే టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.