సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. నారాయణన్ శ్రీ గణేష్(Narayanan Sri Ganesh) పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ ఎన్నిక కూడా నిర్వహించనుంది. దీంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో శ్రీ గణేష్‌కు 41,888 ఓట్లు రాగా, లాస్య నందితకు 59,057 ఓట్లు పోలవ్వడంతో 17,169 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ప్రజానాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేసి ఓడిపోయారు.
అయితే బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 23న పటాన్ చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మృతితో కేంద్ర ఎన్నికల సంఘం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు తేదీని ప్రకటించింది. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో బీజేపీ నుంచి శ్రీగణేష్(Narayanan Sri Ganesh) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన్నే అభ్యర్థిగా వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. లాస్య నందిత కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.