తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘునంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతుంటారు. ప్రజల సేవలో ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా ‘అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ… ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. పరిపాలన పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “నేతలు ఎంత మంది ఉన్నా జాతి గర్వపడే నాయకులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఉంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఒక అనితరసాధ్యుడు, అద్వితీయ దార్శనికుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి. అలాంటి రాజర్షికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని చెప్పారు.