హైదరాబాద్(Hyderabad) పోలీసులు మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 23న గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం హనుమాన్ జయంతి కావడంతో నగరంలో ఉన్న వైన్‌షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరంలో హిందువులు హనుమాన్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున జై శ్రీరామ్ నినాదాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసివేయిస్తున్నారు. కాగా శ్రీరామనవమి సందర్భంగా కూడా ఏప్రిల్ 17న హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే.