మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం బషీర్ బాగ్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో పోలీసుల చిన్నారుల కేర్ సెంటర్(Child Care Centre) ను ఏర్పాటు చేశారు. ఈ కేర్ సెంటర్ లో చిన్నారుల కోసం ఆటబొమ్మలు, వారి ఆలనా పాలనకి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచారు.
శుక్రవారం ఈ కేర్ సెంటర్(Child Care Centre) ని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, అదనపు కమిషనర్లు విక్రమ్ సింగ్ మాన్, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తమ పిల్లల సంరక్షణ కోసం కేర్ సెంటర్ ప్రారంభించడంపై మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.