ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు సీఎం జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy) ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు పలువరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఈసీ(EC) బదిలీ చేసిన సంగతి తెలిసిందే.