తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిర్మల్‌లో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ” కేటీఆర్ నీకు సినిమా వాళ్లు బాగా తెలుసు కదా.. నువ్వు చీర కట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై.. ఆర్టీసీ బస్సు ఎక్కు.. కండక్టర్ నిన్ను టికెట్ డబ్బులు అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అప్పుడు ఒప్పుకుంటాం.. లేకుంటే తాము ఇచ్చిన హామీలు అమలు అయినట్లే..” అంటూ కేటీఆర్‌కు తనదైన శైలిలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్(KTR) కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi)తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. దీంతో కేటీఆర్ దీనిపై ట్విట్టర్లో ప్రశ్నించారు.
“రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చుపిస్తావా.. మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న 1.67 కోట్ల 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు.” అంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వీడియోను కూడా జత చేస్తూ కౌంటర్ ఇచ్చారు.