తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో నిందుతుడు శ్రవణ్ కుమార్‌కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు(Prabhakar Rao)కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటివరకు అరెస్టయిన పోలీస్ అధికారులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వెనక ప్రభాకర్ రావు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని తెలిపారు. అరెస్ట్ సందర్భంగా నిందుతులు వెల్లడించిన విషయాలను కోర్టుకు పోలీసులు వివరించారు.
Phone Tapping Case | మరోవైపు ఈ పిటిషన్‌పై ప్రభాకర్ రావు అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలోనే పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. నిజానికి తాను కూడా కేసీఆర్ బాధితుడిని అని పేర్కొన్నారు. తాను నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలో ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నానని జిల్లా నేతలు చెప్పటంతో తనను బదిలీ చేశారని ఆరోపించారు. అనంతరం ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్‌ఐబీ ఛీప్‌గా నియమించారంటూ వివరించారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదని, క్యాన్సర్ చికిత్స కోసం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినట్లు వివరించారు. చికిత్స పూర్తి కాగానే.. హైదరాబాద్ వస్తానని తెలిపారు.