భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది. ఇండియాలో వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇంస్టాగ్రమ్ తోపాటు మెటా.ఏఐ పోర్టల్ ఇంగ్లీషులో అందుబాటులోకి వచ్చిందని టెక్నాలజీ దిగ్గజం మెటా సోమవారం ఓ ప్రకటన లో తెలిపింది. మెటా యాప్స్ వినియోగిస్తున్నప్పుడు ఫీడ్స్, చాట్స్ లో మెటా ఏఐని ఉపయోగించవచ్చు. అలాగే కంటెంట్ క్రియేట్ చేసుకోవడంతోపాటు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. అత్యంత శక్తివంతమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిన మెటా లామా 3 ఆధారంగా మెటా ఏఐ(Meta AI) రూపుదిద్దుకుందని సంస్థ పేర్కొంది.
‘ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, ప్రయాణిస్తున్న మార్గంలో చూడదగ్గ ప్రదేశాలు ఏమిటని ప్రశ్నించవచ్చు. ఎంచుకున్న సబ్జెక్ట్స్ పై మల్టిపుల్ చాయిస్ టెస్ట్ కోరవచ్చు. అడుగుపెడుతున్న కొత్త ఫ్లాట్ ని ఎలా సౌందర్యంగా తీర్చిదిద్దవచ్చో అడగడం ద్వారా మూడ్ బోర్డ్ సృష్టించుకుని కొనబోయే ఫర్నీచర్ నిర్ణయించుకోవచ్చు’ అని మెటా తెలిపింది. ఫేస్బుక్ ఫీడ్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు సైతం మెటా ఏఐ వినియోగించవచ్చు అని తెలిపింది.