Gautam Gambhir | టీ20 వరల్డ్ కప్‌ను కైవశం చేసుకున్న తర్వాత టీమిండియాకు గుడ్‌బై చెప్తున్నట్లు రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రకటించాడు. దీంతో టీమిండియాకు టీ20 కెప్టెన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. గతంలో కొన్ని టీ20 సిరీస్‌లకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా పేరే మరోసారి వినిపిస్తోంది. టీమిండియా పగ్గాలను సెలక్టర్లు మళ్ళీ పాండ్యా చేతుల్లోనే పెడతారని చర్చ జోరందుకుంది. వాటికి బ్రేకులు వేస్తూ ఇప్పుడు కెప్టెన్ రేసులోకి సూర్యకుమార్ యాదవ్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గౌతమ్ గంభీర్ అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. టీమ్ కెప్టెన్సీని ఎవరికి ఇస్తే బాగుటుంది అన్న అంశంపై సెలక్టర్లు ఇప్పటకే గంభీర్‌తో చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా గంభీర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కెప్టెన్ ఎవరు కావాలో చెప్పకుండా గంభీర్.. ఒక కెప్టెన్‌గా ఎలాంటి ఆటగాడు పనికిరాడు అని వివరించినట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ పోలికలన్నీ కూడా హార్దిక్ పాండ్యాకు(Hardik Pandya) కలుస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పని భారం కారణంగా టీమ్‌లు నట్టేట వదిలి వెళ్లిపోయే ఆటగాడితో తాను పనిచేయలేనని గంభీర్ తేల్చి చెప్పారట.
‘‘కెప్టెన్ ఎవరు అనేది నాకు సంబంధం లేని అంశం. కానీ..కెప్టెన్ అయ్యే ఆటగాడు మాత్రం పని భారాన్ని కారణంగా చూపుతూ జట్టుకు దూరం కాని వాడై ఉండాలి. అలాంటి కెప్టెన్‌తోనే పనిచేయాలని అనుకుంటున్నా’’ అని గంభీర్(Gautam Gambhir) తన మనసులో మాట చెప్పారట. గంభీర్ వ్యాఖ్యల్లోని అంతరార్ధాన్ని గవాస్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అర్థం చేసుకుందని, గంభీర్ సూచనలను అనుసరించే టీమిండ్ నెక్స్ట్ కెప్టెన్‌ను ఎంచుకునేలా ఆలోచనలు చేస్తుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో హార్దిక్ పాండ్యా తరచుగా జట్టుకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా పాండ్యా వద్దు అని గంభీర్ పరోక్షంగా చెప్పాడని ప్రచారం సాగుతోంది.
అంత సమయం లేదు
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్‌ను తీరికగా ఎన్నుకుందాం అనుకోవడానికి కూడా లేదు. అందుకు ఈ నెలాఖరులో టీమిండియా వెళ్లనున్న శ్రీలంక టూర్ ప్రధాన కారణం. ఈ టూర్‌లో భాగంగా ఇండియా, శ్రీలంక మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లలో తలపడనున్నాయి. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌ను ఎన్నుకోవడానికి సెలక్షన్ కమిటీ దగ్గర పట్టుమని పదేపది రోజులు ఉన్నాయి. మరి ఈ అదృష్టం, టీమ్ భారాన్ని, బాధ్యతని సెలక్షన్ కమిటీ ఎవరి భుజాలపై మోపుతుందో చూడాలి.