ఒడిశా(Odisha) – బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక సింధికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి తేజాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. వైద్యం పేరిట ఆయన పలు దఫాలుగా రేష్మా తలలోకి సూదులను గుచ్చాడు. ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు.
Odisha | బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో మాంత్రికుడు తేజాజ్ రాణాను అరెస్టు చేశారు.