ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన తన పూర్తి సమకారం అందిస్తుందని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంఘానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగునేలపై జన్మించిన ఎందరో మహానుభావుల స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్తా అప్పులప్రదేశ్‌గా మారిందని, అంధకారంలోకి వెళ్లిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసింది ఎవరైనా చర్యలు తప్పక ఉండాలని పేర్కొన్నారు.
‘‘వైసీపీ(YCP) హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. దాని వల్లే అమరావతి, పోలవరం ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలు పాల్పడొద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే ఎవరిపై అయినా చర్యలు ఉండాలి. చర్యల విషయంలో తన మన బేధం ఉండకూడదు. తప్పు చేసింది జనసేన(Janasena) వారైనా విడిచి పెట్టేది లేదు. ఆఖరికి నేను తప్పు చేస్తే నన్నైనా వదిలి పెట్టొద్దు. నాపైనా చర్యలు తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్(Pawan Kalyan).