Telangana Assembly |బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుందని చెప్పారు భట్టి విక్రమార్క. వడ్డీలు కట్టడానికే మరో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.35 వేల కోట్ల రుణాలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన అప్పులైనా బాధ్యత మరువకుండా వాటిని చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో అధిక మొత్తాన్ని సంక్షేమాల కోసమే వినియోగించామని వివరించారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ కూడా వ్యక్తిగత లబ్ది కోసం ఆలోచించలేదని తెలిపారు.
‘‘డిసెంబర్, 2023 లో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేనాటికి 6,71,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వపరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాము. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించాము. అంటే, మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి, అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది.
Telangana Assembly | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాలలో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యం పై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి (Capital Expenditure) కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళ తరువాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్దమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసన సభలో ప్రవేశపెట్టడం జరిగింది’’ అని వెల్లడించారు.