Ranbir Kapoor | బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసిన సినిమాల్లో ‘యానిమల్(Animal)’ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కలెక్షన్లలోనే కాదు విమర్శలు అందుకోవడంలో కూడా టాప్ లేపేసింది. ఈ సినిమా అంతా కూడా హింస, రక్తపాతాలతో పాటు స్త్రీ అంటే ఏమాత్రం గౌరవించేలా చూపలేదని, స్త్రీలను తీవ్రంగా కించపరిచే సన్నివేశాలకూ కొదవ లేదంటూ అనేక మంద్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను అసలు బ్యాన్ చేయాలని అన్న వారు కూడా ఉన్నారు. వీటిపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న రణ్‌బీర్ తాజాగా స్పందించాడు.
‘‘ప్రేక్షకులను వినోదాన్ని అందించడం కోసమే సినిమా చేశాం. కాకపోతే అది తప్పుగా అర్థమైంది. ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది నెగిటివిటీని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. కొందరు మాట్లాడుకోవడానికి ఏదో ఒక అంశం కావాలి. అలాంటి వారంతా యానిమల్ సినిమాను స్త్రీ వ్యతిరేక సినిమాగా ప్రచారం చేశారు. ఈ సినిమా విడుదలయ్యాక చాలా మంది కూడా నేను ఈ సినిమాలో చేయకుండా ఉండాల్సిందని అన్నారు. వారందరికీ నేను క్షమాపణలు చెప్పి.. మళ్ళీ ఇలాంటి సినిమా చేయనన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘వారి అభిప్రాయాలతో నేను(Ranbir Kapoor) ఏకీభవించను. కానీ ప్రస్తుతం గొడవలు పెట్టుకునే పరిస్థితిలో లేను. నా పనితీరు బాగాలేదంటే.. తర్వాత సినిమాకు మెరుగుపరుచుకుంటా. అంతే.. ’’ అని వివరించాడు.