ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan). వారిని ఆదుకోవడానికి తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి అధికారులను ఆరా తీశారు. గత ప్రభుత్వం తీరు వల్లే ఇప్పుడు ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరద బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తూ శక్తివంఛన లేకుండా సహాయక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కానీ ఇవేమీ పట్టకుండా వైసీపీ నేతలు మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వరద తగ్గుతోంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గత ప్రభుత్వం తీరు వల్లే ఇన్ని ఇబ్బందులు. ప్రకృతి విపత్తు సమయంలో సహాయం చేయాల్సింది పోయి వైసీపీ కేవలం నిందా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టింది. రెండు మూడు రోజులుగా సీఎం చంద్రబాబు(Chandrababu) సహా మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేస్తున్న పర్యటనలు వాళ్లకు కనిపించడం లేదా? అయినా ఇలాంటి సమయాల్లో రాజకీయాలు మానుకుని ప్రజలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వస్తే ఏం చేయాలి అన్న అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. ప్రతి నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నా. కానీ నా వల్ల సహాయక చర్యలు కుంటుపడకూడదన్న ఉద్దేశంతోనే ఆగిపోయాను. నేను పర్యటించానంటే అది ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండాలే తప్ప.. ఇబ్బంది పెట్టేది కాకూడదనే విజయవాడకు వెళ్లలేదు. నేను రాలేదని వేయాలని అంటున్నారు తప్ప.. ఇంకేమీ లేదు’’ అని వైసీపీ నేతల ఆరోపణలకు Pawan Kalyan చెక్ పెట్టారు.