విజయవాడ వరద ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) ఈరోజు పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిన సహాయం గురించి కూడా ఆరా తీశారు. అనంతరం వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరపున నిత్యావసరాలు అందించారు. ఇంతటి స్థాయి వరద వచ్చి బెజవాడంతా మునిగిపోయి.. లక్షలాది మంది నిత్యావసరాలు కూడా అందక అల్లాడుతున్నా ప్రధాని మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, ఒక్క మాట కూడా మాట్లాడలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు నిరాటంకంగా వర్షాలు పడితే బెజవాడ బుడమేరు అయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు షర్మిల. బుడమేరు ఆక్రమణల వల్లే ఇంతటి స్థాయిలో వరదలు వచ్చాయని, ఆంధ్రలో కూడా హైడ్రా తరహా చర్యలు తీసుకుని బుడమేరు ఆక్రమణలను తొలగించాలని కోరారు.
‘‘కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయింది. సింగ్ నగరలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35వేల ఇళ్లు కూలిపోయాయి. మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ(PM Modi) కనీసం స్పందించలేదు. విజయవాడ(Vijayawada) వరదలు కేంద్రానికి కనిపించడం లేదా..? తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించండి. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరం. కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్‌కి చేరడం లేదు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారు. బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటర్నింగ్ వాల్ కట్టాలి’’ అని ఆమె(Sharmila) తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.