Sleeplessness | ఆరోగ్యకరమైన జీవనంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పకుండా ఉండాలని, లేనిపక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదో ఒక కారణం చెప్తూ రోజుకు ఐదారు గంటలే నిద్రపోతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పకుండా ఉండాలని తాజా అధ్యయనం ఒకటి తెలుపుతుంది. నిద్రలేమి వల్ల సకల రోగాలు వచ్చినట్లే అవుతుందని, తలనొప్పి నుంచి హార్మోన్ ఇన్‌బాలెన్స్ వరకు మరెన్నో రుగ్మతలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అందులోనూ ఒత్తిడి ఉండే పనులు చేసే వారిపై ఈ నిద్రలేమి ప్రభావం సివియర్‌గా ఉంటుందని అంటున్నారు. నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీని వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య ఉంటే అధిక రక్తపోటుకు కూడా దారి తీస్తుంది. ఇది అనేక గుండె జబ్బులకు దారితీస్తోంది.
Sleeplessness | నిద్రలేమి వల్ల గుండె కొట్టుకునే తీరు మారుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. గుండెల్లో మంట రావడంతో పాటు ఏవైనా గుండె సంబంధిత సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రతరం అవుతాయి. దాంతో పాటుగా నిద్రలేమి మన జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మతిమరుపు అధికం అవుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. శరీరం నిస్సత్తువుగా ఉంటుంది. శరీరంలో ఒత్తిడిని పెంచి మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తుంది నిద్రలేమి. రక్తంలోని షుగర్ లెవెల్స్ తారుమారవడంతో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు మరెన్నో రుగ్మతలకు నిద్రలేమి ప్రధాన కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.