తెలంగాణలో ఉన్న ఎన్నో రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెట్ట పీట వేస్తోందని, ఇప్పటికే వీటి కోసం రూ.5వేల కోట్ల నిధులను కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్(Young India Model Schools) కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. పేద, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌లపై ఆయన కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని ఆయన వివరించారు.
‘‘ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు చేపడతాం. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతాం. ప్రతి పేద విద్యార్థికి ఉచితంగానే నాణ్యమైన విద్యను అందిస్తాం. విద్య ఒక్కటే కాకుండా క్రీడలపై కూడా ఫోకస్ పెడతాం. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1023 స్కూళ్లు ఉండగా వాటిలో 600కు పైగా స్కూళ్లకు ఇప్పటికీ సొంత భూములు లేవు. అందుకే రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల భూమి సేకరిస్తున్నాం. దసరా లోపే వీటి భూమి పూజలు ప్రారంభిస్తాం’’ అని ఆయన(Bhatti Vikramarka) వెల్లడించారు.