Cyber Criminal Gang | సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ సైబర్ నేరగాళ్లను కటకటాలపాలు చేస్తూ ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ మొత్తంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నా సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. కోట్లాది రూపాయాలు కొల్లగొడుతున్న ఈ 18 మంది ముఠా ఆటకట్టించారు. వీరిపై దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఈ 18 మంది నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, పాస్ బుక్స్ సహా పలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీరిని అరెస్ట్ చేయడం కోసం పలు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలింపులు జరిపాయని, వీరు హైదరాబాద్‌లోనే ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల రూపాయాలకు పైగా దోచుకున్నారని పోలీసులు వివరించారు. నిందితుల బ్యాంకు ఖాతాలో రూ.1.61 కోట్లు ఉన్నాయని, ఆ ఖాతాను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.
Cyber Criminal Gang | సెక్స్ ఎక్స్‌స్టార్షన్, కొరియర్, పెట్టుబడులు, ఓటీపీలు, ఇన్సూరెన్స్ పేర్లతో సైబర్ నేరాలకు పాల్పడ్డారని, వారు ఇప్పటి వరకు ఏడు కోట్ల రూపాయల వరకు దోచుకున్నారని చెప్తున్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుల మేరకు సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచి వారిని పట్టుకున్నామని వెల్లడించారు. వీరిపై ఇప్పటి వరకు సుమారు 319 కేసులు ఉన్నాయని, వీరంతా పాత నేరగాళ్లే అని పోలీసులు గుర్తించారు. వారంతా ఇప్పుడు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాల జోరును పెంచారని సీపీ ఆనంద్(CP Anand) తెలిపారు. ‘‘గుర్తుతెలియని వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు. తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చి పోలీసులమని చెప్తే వాటికి రెస్పాడం కావొద్దు. ఇటువంటి ఫోన్ కాల్స్‌ను కట్ చేయాలని సూచిస్తున్నాం. పదేపదే కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి’’ అని ఆయన వివరించారు.