ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆలయాల్లో ప్రసాదాలతో పాటు మొక్కలను కూడా ప్రసాదంగా ఇవ్వాలని కోరాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను కలిసే అవకాశం లభిస్తే ఆయనకూ ఇదే విషయాన్ని వివరిస్తానంటూ చెప్పుకొచ్చాడీ విలక్షణ నటుడు. ఆయన తాజాగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షియాజీ షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. కాగా తాను ఇదే పని చేస్తున్నానని, పలు చోట్ల ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కలను కూడా భక్తులను అందిస్తున్నానని చెప్పారు. దీనంతటికీ తన తల్లే కారణమని వివరించారు.
‘‘మా అమ్మ 97ఏళ్ల వయసులో మరణించారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒకసారి అడిగాను.. నా దగ్గర ఇంత డబ్బు ఉన్నా నిన్ను బతికించుకోలేక పోతున్నాను. ఏం చేయాలి అని బాధపడ్డాను. అప్పుడే మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలు నాటాలని అనుకున్నా. ఆ చెట్లను చూసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది. అందుకే అంటున్నా ఆలయాలకు వచ్చే వారికి కూడా ప్రసాదంతో పాటు మొక్కలను ఇవ్వాలని. అలా చేస్తే చాలా బాగుంటుంది. భక్తులు ఆ మొక్కల్లో భగవంతుడిని చూసుకోవచ్చు’’ అని షియాజీ(Sayaji Shinde) తన మనసులో మాట చెప్పాడు.