తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) దరఖాస్తు కోసం ప్రభుత్వం అప్లికేషన్ విడుదల చేసిందని, వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటు కొన్ని రోజులగా తెగ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త. రేషన్ కార్డు లేని వారు.. అప్లికేషన్ నింపి ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యుల జనన నిర్ధారణ పత్రాలు, కుటుంబ ఫొటో జత చేసి స్థానిక వీఆర్ఓలకు అందించాలని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది నిజమే అనుకున్న చాలా మంది ఇదే తరహాలో చేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చేరింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించుకుని ఈరోజు ఓ ప్రకటన చేసింది.
‘‘ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) దరఖాస్తు కోసం ప్రభుత్వం ఇప్పటి వరుకు ఎటువంటి అప్లికేషన్ విడుదల చేయలేదు. ప్రజలు ఇటువంటి గాలి వార్తలను, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఏదైనా ప్రకటన ఉంటే అధికారికంగా ప్రకటిస్తాం. వాటినే నమ్మాలి. ఇప్పటి వరకు తెలుగు భాషలో ఎటువంటి అప్లికేషన్‌ను సిద్ధం చేయలేదు. విడుదల అసలే చేయలేదు’’ అని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్(DS Chauhan) ప్రకటించారు.