భోజనం చేసిన తర్వాత స్నానం(Bath After Meals) చేయడం చాలా మందికి అలవాటు. ఇలా చేయడం వల్ల శరీరం సేదతీరినట్లు అనిపించి వెంటనే నిద్ర వస్తుందని కొందరు చెప్తే.. మరికొందరు ఇంకేవేవో కారణాలు చెప్తారు. ఈ అలవాటు ప్రస్తుత విద్యార్థుల్లో కూడా పెరుగుతోంది. కానీ ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో ఉండే సహసహానుభూత నాడీ వ్యవస్థ మన జీర్ణక్రియను నియంత్రిస్తుందని, భోజనం తర్వాత జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా ఈ నాడీ వ్యవస్థ చేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కానీ భోజనం తర్వాత స్నానం చేయడం అనే అలవాటు ఈ పనితీరు మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు శరీరంపై వేడి నీళ్లు పడిన వెంటనే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయని, పెరిగిన వేడిని తగ్గించడం కోసం చర్మానికి దగ్గరగా ఉండే రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరిగి శరీరాన్ని చల్లబర్చడానికి ప్రక్రియలు మొదలవుతాయి. అలా పెరిగే ఉష్ణోగ్రత చర్మం, రక్తం ద్వారా బయటకు పోతుంది. ఇది నాడీవ్యవస్థపై ప్రభావం చూపి జీర్ణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నమాట. ఫలితంగా అరుగుదల తగ్గడం, ఎసిడిటీ సమస్య రావడంపాటు మరికొన్ని ఉదర సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు వైద్యులు. ఈ అలవాటును వీలైనంత త్వరగా మార్చుకోవాలని లేకుంటే అనేక సమస్యలకు పునాదిగా మారుతుందంటున్నారు నిపుణులు.
ఇలానే చేస్తూ ఉంటే మాల్‌అబ్సార్పషన్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. పోషకాలను పూర్తిస్థాయిలో గ్రహించడాన్ని శరీరం మానుకుంటుందని, దాని వల్లే పోషకాహార లోపం ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్తున్నారు. కాబట్టి భోజనం తర్వాత స్నానం చేద్దామని అనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని, భోజనానికి, స్నానానికి మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటే ఈ ప్రతికూల ప్రభావాలను కాస్తంత నియంత్రించవచ్చని చెప్తున్నారు. అయితే ఈ అలవాటును పూర్తిగా మానుకోవడం మంచిదని, వీలైతే స్నానం తర్వాత భోజనం చేయడం మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.
మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కూడా స్నానం తర్వాతే భోజనం చేయాలని చెప్తాయని, భారతదేశ వైద్య విధానమైన ఆయుర్వేదంలో కూడా ఇదే ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. స్నానం తర్వాత భోజనం చేయడం వల్ల శరీరం సేదతీరి గాఢ నిద్రకు సహకరిస్తుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల రక్తపోటు అధికమవుతుందని, దాని కారణంగా అనేక ఇతర వ్యాధులు వస్తాయని అంటున్నారు వైద్యులు.
భోజనం తర్వాత స్నానం(Bath After Meals) చేయడం అనే అలవాటు డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందనేది నిపుణులు చెప్తున్న మాట. చల్లటి నీటి స్నానమైనా, వేడి నీటి స్నానమైనా మన శరీరంలోని నీటి శాతాన్ని ఆవిరయ్యేలా చేస్తుందని, తద్వారా డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అదే విధంగా వేడి నీటి స్నానం చేయడం వల్ల బీపీ తాత్కాలికంగా పెరుగుతందని చెప్తున్నారు. ఇలా బీపీలో వచ్చే హెచ్చుతగ్గులు హైపర్‌టెన్షన్ ఉన్నవారికి పెద్ద సమస్యగా మారుతుందని వివరిస్తున్నారు.