దక్షిణ మధ్య రైల్వేస్‌కు ‘దానా’ తుఫాను(Dana Cyclone) దడపుట్టిస్తోంది. ఈ తుఫాను దెబ్బకు ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ జాబితాలో మరిన్ని రైళ్లను జోడించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగునుంది. ఈ కేంద్రాల్లో రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే దాదాపు 17 నగరాలు, పట్టణాల్లో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ‘దానా’ తుఫాను దెబ్బకు 200 రైళ్ల సేవలను రద్దు, దారి మళ్లించినట్లు తెలిపారు అధికారులు.
అప్రమత్తమైన ఒడిశా సర్కార్
మరోవైపు ‘దానా’ తుఫాను(Dana Cyclone) నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలను చేపట్టింది. వీటిలో భాగంగానే ఈ నెల 23 నంుచి 25 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఆఖరికి ఈనెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని కూడా తెలిపింది. వీటితో పాటుగానే ఈ నెల 24, 25 తేదీల్లో నందన్‌కానన్ జూ, బొటానికల్ గార్డెన్‌లకు సందర్శకులను అనుమతించొద్దని కూడా అధికారులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాను సమయంలో మూగ జీవాలకు ఆశ్రయం కల్పించాలని, ఈ ఏర్పాట్లలో ఏమాత్రం రాజీ పడొద్దని ఒడిశా మత్స్య, పశుసంవర్దక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ వెల్లడించారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారాయన. గాయపడిన జంతువులను గుర్తిస్తే 1962 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కూడా తెలిపారు మంత్రి గోకులానంద.