విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు(Bomb Threats) దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వీటికి మూలం మాత్రం చిక్కడం లేదు. దానికి తోడు రోజూ విమానాలకు బాంబు బెదిరింపులు వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) హెచ్చరించినా.. బెదిరింపులు ఆగడం లేదు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బెదిరింపులు అధికంగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న క్రమంలో సోషల్ సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ బెదిరింపుల వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సదరు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
‘‘నిబంధనలను అతిక్రమిస్తే సమాచార సాంకేతిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర ఆదేశాలను ధిక్కరిస్తే ఆయా ఫ్లాట్‌ఫామ్‌లకు థర్డ్ పార్టీ కంటెంట్‌ను తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తాం. వివిధ ఎయిర్‌లైన్స్‌కు ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపు(Bomb Threats) ఫోన్ కాల్స్, వాటి వల్ల నిలిచిపోయిన, ఆలస్యమైన విమాన సర్వీసులు, ఇతర కార్యకాలాపాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం’’ అని కేంద్రం వివరించింది. కాబట్టి సదరు సోషల్ మీడియా సంస్థలు(Social Media Companies) కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు యుద్దప్రాతిపదికన తీసుకోవాలని కేంద్రం కోరింది.