విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులకు(Bomb Threats) కేంద్రం సైతం అడ్డుకట్టవేయలేకుంది. వీటిని తీవ్రంగా పరిగణిస్తామని కేంద్రం హెచ్చరించినా బెదిరింపులు ఏమాత్రం నెమ్మదించలేదు. తాజాగా ఆదివారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు వచ్చాయని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో 14 రోజుల్లో మొత్తం 350కిపైగా ఈ బెదిరింపులు వచ్చాయని గణాంకాలు చెప్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు అధికంగా వస్తుండటంతో సదరు ఫ్లాట్‌ఫార్మ్‌లకు కేంద్రం వార్నింగ్ సైతం ఇచ్చింది. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే కఠిన చర్యలు ఉంటాయని, సదరు సంస్థలు థర్డ్ పార్టీ కంటెంట్‌ను తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని కూడా కేంద్రం హెచ్చరించింది.
తాజాగా తమ సంస్థకు చెందిన 15 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని ఆకాశ ఎయిర్‌లైన్స్(Akasa Air) ప్రకటించింది. వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకుని ఆయా విమానాలకు తరువుగా తనిఖీ చేశామని, ఆ తర్వాత ఆయా విమాన సర్వీసులను పునరుద్దరించామని సదరు సంస్థ వెల్లడించింది. వీటితో పాటుగా విస్తారా(Vistara) సంస్థకు చెందిన 17 విమానాలు, ఇండిగోకు(IndiGo) చెందిన 18 విమానాలకు బెదిరింపులు(Bomb Threats) వచ్చినట్లు సమాచారం. దీంతో విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులను అడ్డుకోవడం కేంద్రానికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.